Tuesday, June 19, 2012

వర్షాకాలం... తీసుకోవలసిన జాగ్రత్తలు

వర్షాకాలం... తీసుకోవలసిన జాగ్రత్తలు:

వేసవి తాపాన్ని, భూమాత దాహాన్ని తీర్చటానికి చిరుజల్లులతో, గంభీరంగా ఉరుముతూ భారీ వర్షాలతో ముంగిళ్ళని తడుపుతూ వానాకాలం వచ్చేసింది. వర్షాకాలం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త పడవలసిన సమయం. ఎన్నోరకాల వ్యాధులు (కొన్ని చాలా ప్రమాదకరమైనవి కూడా) తేలికగా ప్రబలే  అవకాశం ఉంది. ఈ వ్యాసంలోఅలాంటి కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు మరియు వాటి నివారణ గురించి తెలుసుకుందాం.

జలుబు దాన్ని అనుసరిస్తూ దగ్గు:
ఇది చాలా తరచుగా మనల్ని పలకరించే వ్యాధి. వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. నివారణ లేదు. ఐతే తరచూ చేతులు కడుక్కోవటం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చు (ముఖ్యంగా చిన్నపిల్లల్లో).

మలేరియా:
చాలా ప్రమాదకరమైన వ్యాధి. దోమలద్వారా వ్యాప్తి చెందుతుంది.

లక్షణాలు:
చలి జ్వరం, వాంతులు, తల మరియు వళ్ళు నొప్పులు, దగ్గు, విరోచనాలు.
(చలిజ్వరం ప్రతి 48 గంటలకి వస్తూ తగ్గుతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఈ క్రిమి ఎర్ర రక్త కణాలని నాశనం చేస్తుంది, తద్వారా రక్తహీనతని కలుగజేస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఇలా నశించిన రక్త కణాలు రక్తనాళాలకు అడ్డుపడి మెదడు రక్తప్రసరణని అడ్డుకుంటాయి. దీన్ని సేరెబ్రల్ మలేరియా అని వ్యవహరిస్తారు.


నివారణ:
ఏకైక ఉత్తమమైన మార్గం :  దోమతెరలని వాడటం.  
(గమనిక: Mosquito repellents వాడి ఆరోగ్యం చెడగొట్టుకోవటం/దోమల నిరోధక శక్తిని పెంచటం తీవ్రమైన నేరం. దానికి పరిహారం మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు చిరంజీవులైన దోమలతో చిరకాలం కలిసి కుట్టించుకోవలసి ఉంటుంది గాక!!!).

ఇంకా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవటం, నీరు, మురుగు నిలువ ఉండకుండా చూసుకోవటం ముఖ్యం. మనం ఏమీ చేయలేనప్పుడు కనీసం కిరోసిన్/క్రిమి సంహారకాలు చల్లటం అవసరం.

 డెంగ్యు:
వర్తమానాన్ని వణికిస్తున్న, భవిష్యత్తుని భయపెట్టే వ్యాధి. ఇది కూడా దోమలద్వారా సంక్రమిస్తుంది. 
లక్షణాలు:
విపరీతమైన జ్వరం, వొళ్ళు నొప్పులు, శరీరంపై దద్దుర్లు రావటం(4-5 రోజుల తర్వాత).
ఈ వ్యాధికి  ప్రత్యేకమైన చికిత్స లేదు. ఎక్కువ ద్రవాహారాన్ని తీసుకోవాలి.


నివారణ:
ఏకైక ఉత్తమ మార్గం :  దోమతెరలని వాడటం.

ఇక కలరా మరియు టైఫాయిడ్ ఎక్కువగా మన అపరిశుభ్రత మరియు అజాగ్రత్త వలన సంక్రమిస్తాయి. వీటిని కాచి వడబోసిన నీటిని త్రాగటం మరియు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా అరికట్టవచ్చు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి.

ఈ వర్షాకాలంలో అందరూ  తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ

మీ
చైతన్య.

(తెహెల్కా పత్రిక ఫోటోగ్రాఫర్ తరుణ్ సేహ్రవత్ మరణం దానికి గల కారణాలు ఈ వ్యాసం రాయటానికి ప్రేరేపణ) .


Sunday, June 3, 2012

ఏదో సాధించాలని

ఏదో సాధించాలని మనస్సు తపిస్తోంది
భావోద్వేగంతో గుండె బరువెక్కింది
సాధించాల్సింది చాలా ఉంది, సాధన లేమీ చాలా ఉంది
కానీ వయస్సుకి వక్రమార్గమంటే ఇష్టం, మనస్సుకి మరోలోకమంటే ఇష్టం
ఈ అవలక్షణాలు ప్రగతి నిరోధాలు
అంకురించాలి మనలో మేధాసంపత్తులు
అసాధ్యమైనా సుసాధ్యమైనా 
అంతా మనచేతిలోనే ఉంది
భవిత కొరకు నడుచుకుంటే బ్రతుకుతెరువు లేకపోదు
బానిసబ్రతుకుకంటే భారమైన పనిలేదు
ఎందుకు ఈ జీవితం అనుకుంటే భవిత మృగ్యం 
ఆశావాదమే మనిషికి అవసరం, అనుభవపురాణమే ఈ జీవితం
వృధా చేయకు ఏ క్షణమూ, చేయకు నిరీక్షణము
అలసత్వాన్ని విరమించు, అజ్ఞానాన్ని తొలగించు
ఆలొచించు గ్రహించు ఆచరించు
ఓ భావిపౌరుడా అనుసరించు!!!